భీమిలి, అక్టోబర్ 18:
భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మండలంలోని మూలకుద్దు గ్రామానికి చెందిన సుమారు 300 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆదివారం భీమిలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆనందపురం మండలంతో పాటు జీవీఎంసీ పరిధిలోని 1వ వార్డు తగరపువలస, 6వ వార్డు అమరావతి నగర్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరినట్లు తెలిపారు. ఇంకా అనేకమంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
164 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి కూటమి చరిత్ర సృష్టించిందని గంటా శ్రీనివాసరావు అన్నారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయాలను నమోదు చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తల కృషి కీలకమని పేర్కొన్నారు.
అలాగే, మాజీ సైనికోద్యోగుల కార్యాలయానికి స్థలం కేటాయించే అంశంలో కృషి చేస్తానని గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్చార్జి చిక్కాల విజయ్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు సరగడ అప్పారావు, మాజీ జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, పార్టీ మాజీ అధ్యక్షుడు డి.ఎ.ఎన్. రాజు తదితరులు పాల్గొన్నారు.