మధురవాడ:
జీవీఎంసీ 8వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిల్ల రేవతి వార్డులోని ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే తెలుసుకున్నానని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
వార్డులో ప్రధానంగా డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల కొరత, తాగునీటి ఇబ్బందులు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా, సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను అన్వేషిస్తానని వెల్లడించారు.
తన మామగారైన పిల్ల నర్సింగరావు అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవకు అంకితమవుతానని పిల్ల రేవతి స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వార్డు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
ప్రజల నమ్మకమే బలం.. వార్డు అభివృద్ధే లక్ష్యం!
8వ వార్డులో పారిశుద్ధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీరు వంటి సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే తన ప్రాధాన్యత అని పిల్ల రేవతి పేర్కొన్నారు. ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.