మధురవాడ: జీవీఎంసీ పదో వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న పోతిన ప్రమీల, వార్డు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. పదో వార్డు పరిధిలోని పీఎం పాలెం, పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు.
గతంలో ఇదే వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రియాంక పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సేవలందించారని ఆమె గుర్తుచేశారు. ముఖ్యంగా పార్కుల అభివృద్ధి, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
తాను కార్పొరేటర్‌గా గెలుపొందితే వార్డులో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచి, పదో వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పోతిన ప్రమీల తెలిపారు. డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం, పార్కుల నిర్వహణతో పాటు ప్రజలకు ఎదురయ్యే ఇతర సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తానని తెలిపారు.
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి
పదో వార్డు అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని పేర్కొన్న పోతిన ప్రమీల, ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతానన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని పదో వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు తనపై ఉంచే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని ఆమె తెలిపారు.