న్యూఢిల్లీ: భారత్–వియత్నాం మధ్య రక్షణ, భద్రతా సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన 19వ భారత్–వియత్నాం జాయింట్ కమిషన్ సమావేశంలో రక్షణ రంగంలో సహకారాన్ని విస్తరించడంపై ఇరు దేశాలు చర్చించాయి.
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రంగ్ ఈ సమావేశానికి సహాధ్యక్షత వహించారు.
రక్షణ రంగంలో భారతదేశంలో తయారయ్యే పరికరాల సరఫరాను పెంచడంతో పాటు, రక్షణ పరికరాల సంయుక్త ఉత్పత్తికి అవకాశాలను పరిశీలించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
దీంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, సరఫరా గొలుసులు, మార్కెట్ యాక్సెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి రంగాల్లో కూడా ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించే అంశాలపై చర్చ జరిగింది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రతా సహకారాన్ని పెంచుకోవడంలో భారత్‌కు వియత్నాం ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న సహకారాన్ని మరింత విస్తరించే దిశగా తాజా సమావేశం కీలకంగా మారింది.