**...సాలూరులో ఇదేం ట్విస్టు గురూ..!?
కురుపాం టు సాలూరు… కనెక్టింగ్ స్టోరీ!**
కాలం కలిసొచ్చినోడికి అదృష్టం తలుపు తడితే... మన రాజకీయ నాయకులకి మాత్రం "రిజర్వేషన్లు" కిటికీలోంచి కన్నుకొడతాయి! సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం "బీసీ మహిళ"కి ఖరారైందన్న వార్త రాగానే... మనోళ్ల బీపీ ఒక్కసారిగా 180కి లేచిందట..! "అయ్యో... ఇప్పుడు ఆడోళ్లని ఎక్కడినుంచి తేవాలి సామీ?" అని పార్టీలన్నీ తలలు పట్టుకుంటుంటే, మనోడు మాత్రం సైలెంట్‌గా కార్నర్ సీటులో కూర్చుని స్కెచ్ వేశారట.
అలా… టీడీపీ మాజీ కౌన్సిలర్ వైకుంఠపు హర్షవర్ధన్ తన ప్రేయసి గుళ్ల మంజీరను హడావిడిగా గుడిలో పెళ్లి చేసుకొని, మున్సిపల్ చైర్మన్ పదవి కోసం కర్చీఫ్ వేసేసారట! సమయానికి ప్రేయసి ఉంది కాబట్టి సరిపోయింది... లేకుంటే పరిస్థితి ఏంటి? ‘ఎమర్జెన్సీ మ్యాట్రిమోనీ’ పెట్టి, "బీసీ వధువు కావలెను... కట్నం వద్దు, చైర్‌పర్సన్ సీటు ముద్దు" అని ఫ్లెక్సీలు కట్టేసేవారేమో!
రిజర్వేషన్ పుణ్యమా అని, లవ్‌స్టోరీ కాస్తా... 'పొలిటికల్ టర్న్' తీసుకుని, మూడు ముళ్లతో ఏకంగా మున్సిపాలిటీకే లంగరు వేసేశారు. గతంలో కురుపాంలో శత్రుచర్ల వారి ఇంట్లోనూ ఇలాంటి సీన్ కదా జరిగింది! నియోజకవర్గం ఎస్టీకి రిజర్వ్ కాగానే... జగనన్న ఇచ్చిన మాస్టర్ ప్లాన్‌తో కురుపాం చిన జమీందార్ శత్రుచర్ల పరీక్షిత్ రాజు గిరిజన అమ్మాయి కోసం అన్వేషణ మొదలెట్టారు.
అలా కోడలిగా ఎంట్రీ ఇచ్చిన పాముల పుష్ప శ్రీవాణి ఏకంగా డిప్యూటీ సీఎం కుర్చీనే ఏలేశారు. ఎవరి జాతకంలో ఏముందో ఎవరికెరుక? పుట్టింటి వాళ్లు "నా కూతురు మహారాణిలా బతుకుతుంది" అంటే మనం నవ్వుకుంటాం గానీ... రాజకీయాలు పుణ్యమా అని నిజంగానే కుర్చీ ఎక్కేస్తున్నారు.
ప్రేమ గుడ్డిది అంటారు గానీ... మన రాజకీయ నాయకుల ప్రేమ మాత్రం రిజర్వేషన్ రోస్టర్ పాయింట్‌ను కూడా మైక్రోస్కోప్‌తో స్కాన్ చేయగలదు బాస్! రాజయోగం ఉండాలే గానీ… పీఠం కోసం పరిగెత్తాల్సిన పనిలేదేమో… కొన్నిసార్లు పీఠమే పెళ్లి పీటల దగ్గర కనిపిస్తుందేమో!