విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గిరిజన భాషల పరిరక్షణపై రెండు రోజుల సదస్సు నిర్వహించనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శక్తి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 23, 24 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుంది.
“గిరిజన భాషలూ భారతీయ భాషలే” అనే అంశంపై జరిగే ఈ సదస్సులో గిరిజన భాషల ప్రాధాన్యత, వాటి పరిరక్షణ, భవిష్యత్ తరాలకు భాషా సంపదను అందించాల్సిన అవసరంపై చర్చించనున్నారు. అక్టోబర్ 23న సాయంత్రం జరిగే బహిరంగ సభకు ప్రముఖ సాహితీవేత్త, సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి. వేణుగోపాల రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
అనంతరం గిరిజన భాషల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండో రోజు అక్టోబర్ 24న ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సంగోష్టి కొనసాగుతుంది.
గిడుగు రామమూర్తి గారు సవర భాష పరిరక్షణ కోసం చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని, కనుమరుగవుతున్న భారతీయ భాషలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.
స్థలం: డా. బి.ఆర్. అంబేడ్కర్ అసెంబ్లీ హాల్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం.