అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాలకు భక్తుల రాక ఇటీవల గణనీయంగా పెరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
వినాయక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా సోమవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య ఇటీవలి కాలంలో 35 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, భద్రతా చర్యలు పెంచడం వల్ల భక్తుల రద్దీ పెరిగిందని మంత్రి తెలిపారు.
గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో మరిన్ని ఆలయాలను అభివృద్ధి చేసే ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. అనేక ఆలయాల్లో నిత్య నైవేద్యం, అన్నదానం వంటి కార్యక్రమాలను విస్తరిస్తున్నామని తెలిపారు.
తిరుమల, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాలతో పాటు ఇతర ఆలయాల్లో కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా రాష్ట్రంలోని దేవాలయాలకు మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.