విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారత ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర ప్రపంచ ఆర్చరీ వేదికపై చరిత్ర సృష్టించారు. మెక్సికోలోని సాల్టిల్లో వేదికగా జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించారు.
ఫైనల్లో జపాన్‌కు చెందిన జున్యా నకనిషితో ధీరజ్ తలపడ్డారు. ఐదు సెట్ల అనంతరం స్కోరు 5-5తో సమంగా నిలిచింది. దీంతో విజేతను నిర్ణయించేందుకు షూట్-ఆఫ్ నిర్వహించారు. షూట్-ఆఫ్‌లో ధీరజ్ 10 పాయింట్లను సాధించగా, జపాన్ ఆర్చర్ 9 పాయింట్లు మాత్రమే సాధించాడు. దీంతో ధీరజ్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ విజయంతో ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో పురుషుల రికర్వ్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారతీయ ఆర్చర్‌గా ధీరజ్ బొమ్మదేవర చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా ఈ పోటీల్లో భారత పురుష రికర్వ్ ఆర్చర్‌కు 16 ఏళ్ల తర్వాత పతకం లభించింది.
ధీరజ్ విజయవాడకు చెందిన 25 ఏళ్ల ఆర్మీ క్రీడాకారుడు. ఆయన ఇప్పుడు భారత రికర్వ్ ఆర్చరీ జట్టులో కీలక క్రీడాకారుడిగా ఎదిగారు. గతంలో అంతర్జాతీయ వేదికలపై కూడా తన ప్రతిభను చాటుకున్న ధీరజ్.. ఈసారి ప్రపంచకప్ ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి బంగారు పతకాన్ని సాధించారు.
ఫైనల్‌కు ముందు క్వార్టర్ ఫైనల్లో టర్కీకి చెందిన బెర్కిమ్ ట్యూమర్‌ను, సెమీఫైనల్లో ఫ్రాన్స్‌కు చెందిన జీన్-చార్లెస్ వల్లడాంట్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు.
ధీరజ్ విజయం పట్ల ఆంధ్రప్రదేశ్‌లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడకు చెందిన క్రీడాకారుడు ప్రపంచ స్థాయిలో భారత జెండాను ఎగురవేయడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.