విశాఖపట్నం: వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం నగరానికి భవిష్యత్తులో తాగునీటి కొరత రాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందనే చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో Vizag Development Council ఆధ్వర్యంలో “Visakhapatnam Water Security Mission 2047” పేరుతో దీర్ఘకాలిక నీటి భద్రతా ప్రణాళికను ప్రతిపాదించారు. సింగపూర్‌లో అమలు చేస్తున్న బహుళ వనరుల నీటి నిర్వహణ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని విశాఖకు అనువైన మోడల్‌ను రూపొందించాలని భావిస్తున్నారు.
నగర అవసరాలను ఒకే నీటి వనరుపై ఆధారపడకుండా వివిధ వనరులను సమన్వయం చేసుకోవడం ఈ ప్రతిపాదనలో ప్రధాన అంశంగా ఉంది.
రిజర్వాయర్లు, గోదావరి జలాలు తదితర వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు వర్షపు నీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
విశాఖ జనాభా, పారిశ్రామిక అభివృద్ధి, భవిష్యత్ నగర విస్తరణను దృష్టిలో పెట్టుకుని 2047 వరకు నీటి అవసరాలను అంచనా వేసి ప్రణాళిక రూపొందించాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తున్నారు.