GVMC కీలక ఆదేశాలు.. 60 గేటెడ్ కమ్యూనిటీలకు నోటీసులు
విశాఖ నగరంలో నీటి సరఫరా వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కీలక చర్యలు చేపట్టింది. నగరంలోని బోర్‌వెల్స్, ప్రైవేట్ నీటి ట్యాంకర్లపై ఆధారపడుతున్న గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సంస్థలు ఇకపై మున్సిపల్ నీటి సరఫరాను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
నగర పరిధిలో సుమారు 60 గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సంస్థలు ప్రైవేట్ నీటి వనరులపై ఆధారపడుతున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అర్హత ఉన్న సంస్థలు ప్రత్యేక బల్క్ వాటర్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు.
నీటి సరఫరాలో పారదర్శకత, పర్యవేక్షణ పెంచడంతో పాటు భూగర్భ జలాలపై అధిక ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ చర్యల ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు.
మున్సిపల్ నీటి సరఫరాకు మారడం ద్వారా నీటి వినియోగాన్ని పర్యవేక్షించడం, సరఫరాను ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.