కదిరి, సెప్టెంబర్ 5 (APTODAY): కదిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు, పరిశుభ్రమైన వాతావరణం, అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆసుపత్రి డెవలప్‌మెంట్ కమిటీ (HDS) సమావేశాన్ని కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా కాంట్రాక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని, సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, రోగులకు సమయానికి వైద్య సేవలు అందిస్తూ మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రి పరిసరాలు, వార్డులు, మరుగుదొడ్లలో పారిశుధ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ రోగులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులకు భోజన సౌకర్యం కల్పించే అంశంపైనా సమావేశంలో చర్చించారు. శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదానం ద్వారా ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు భోజనం అందించే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఈ అంశంపై తదుపరి HDS సమావేశానికి ఆలయ ఈవోను ఆహ్వానించి, అన్నదానం నిర్వహణ విధానం, అవసరమైన ఏర్పాట్లు, అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించి, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం, పరిశుభ్రమైన వాతావరణం, అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ఆసుపత్రి అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ లేకుండా అవసరమైన చర్యలు చేపడతామని కందికుంట వెంకటప్రసాద్ స్పష్టం చేశారు. సమావేశంలో APHM IDC ఎస్‌ఈ ఐ. ఇంద్ర, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్, HDS సభ్యులు రెడ్డిభాష, కేశవ్ రెడ్డి, వేణు రెడ్డి, కుటాల లక్ష్మణ్, వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.