అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
సోమవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.