కదిరిలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
రజకుల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటాన్ని స్మరించుకున్న నాయకులు
కదిరి, సెప్టెంబర్ 10 (AP Today): శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఎల్లప్ప దోబీ ఘాట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, రజక సంఘం సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ.. రజకుల హక్కుల కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సామాజిక అన్యాయాలను ఎదురించి ధైర్యంగా పోరాడిన ఐలమ్మ ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
రజకుల హక్కులు, సంక్షేమం కోసం రజకులంతా ఐక్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
రజక సంఘం కార్యక్రమాలను విజయవంతం చేయాలి
రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో రజకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సంఘం చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రజకుల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర రజక సంఘం సత్యసాయి జిల్లా గౌరవ అధ్యక్షుడు కనుముక్కల లక్ష్మన్న, జిల్లా అధ్యక్షుడు బాపనపల్లి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు తలుపుల గంగన్న, ఆర్టీసీ నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లబెల్లె శివశంకర్, కదిరి పట్టణ అధ్యక్షుడు పులగంపల్లి శివప్ప, ప్రధాన కార్యదర్శి లింగమయ్య, అంజలి, రజక సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.