హైదరాబాద్: ఫోక్ ఆర్టిస్టులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన Crime No.1559/2026 కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈశ్వర్ సాయి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
ఈశ్వర్ సాయి తరఫున హైకోర్టు న్యాయవాది నాగూర్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో BNS సెక్షన్ 69 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
FIRలోని వివరాల ప్రకారం.. ఈశ్వర్ సాయి తనను వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధాలు కొనసాగించారని, అనంతరం వివాహానికి నిరాకరించారని మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఫిర్యాదులో పేర్కొన్న మరో అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈశ్వర్ సాయి ఇప్పటికే వివాహితుడని, తన భార్యకు విడాకులు ఇస్తానని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే వివాహితుడైన వ్యక్తి భవిష్యత్తులో వివాహం చేసుకుంటానని ఇచ్చిన హామీకి సంబంధించిన ఆరోపణలను కోర్టు ఏ విధంగా పరిశీలిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఈశ్వర్ సాయి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు, కోర్టు తదుపరి నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
గమనిక: కేసులోని ఆరోపణలు కోర్టులో నిరూపితం కావాల్సి ఉంది. తుది న్యాయ నిర్ణయం వెలువడే వరకు ఆరోపణలను నిర్ధారిత వాస్తవాలుగా పరిగణించరాదు.