హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. రాత్రి వేళల్లో ప్రయాణించే వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది.
మంగళవారం.. సెప్టెంబర్ 1 నుంచి హైదరాబాద్‌లో ఆరు ప్రధాన మార్గాల్లో నైట్ బస్సు సర్వీసులను పునఃప్రారంభించింది. ఈ బస్సులు రాత్రి 10 లేదా 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ. శ్రీధర్ ఈ వివరాలను వెల్లడించారు. ఐటీ కారిడార్‌తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను అనుసంధానిస్తూ మొత్తం 15 బస్సులతో నైట్ సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన, డిమాండ్‌ను బట్టి భవిష్యత్‌లో బస్సుల సంఖ్యను పెంచుతామని అధికారులు తెలిపారు.
గతంలో ‘నైట్ రైడర్స్’ పేరుతో ఆర్టీసీ నైట్ సర్వీసులను నడిపింది. అయితే ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో ఆ సేవలను నిలిపివేశారు. ప్రస్తుతం రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ముఖ్యంగా ఐటీ, హాస్పిటాలిటీ రంగాల సిబ్బంది, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను తిరిగి ప్రారంభించారు.
ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆరు రూట్లు ఇవే..
- 222A రూట్‌లో కోఠి నుంచి పటాన్‌చెరు వరకు బస్సులు నడుస్తాయి. అబిడ్స్, లక్డీకాపూల్, కొండాపూర్ మీదుగా ఈ సర్వీస్ కొనసాగుతుంది. ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.
- 218 రూట్‌లో అఫ్జల్‌గంజ్ లేదా సీబీఎస్ నుంచి పటాన్‌చెరు వరకు సర్వీస్ ఉంటుంది. కోఠి, కేపీహెచ్‌బీ, మియాపూర్ మీదుగా బస్సు ప్రయాణిస్తుంది.
- 219 రూట్‌లో సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు వరకు బస్సులు నడుస్తాయి. ప్యారడైజ్, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ మీదుగా ఈ సర్వీస్ కొనసాగుతుంది.
- 290U రూట్‌లో హయత్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఎల్‌బీనగర్, నాగోల్, తార్నాక మీదుగా సర్వీస్ ఉంటుంది.
- 195W రూట్‌లో బాచుపల్లి నుంచి వేవ్‌రాక్ వరకు బస్సులు నడుస్తాయి. ఐటీ క్యాంపస్‌లను కలుపుతూ ఈ సర్వీస్ కొనసాగుతుంది.
- 10H రూట్‌లో కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు నైట్ బస్సు సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
రాత్రివేళల్లో ప్రయాణించే వారికి సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన రవాణా సౌకర్యాన్ని అందించడమే ఈ నైట్ సర్వీసుల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. యాప్ ఆధారిత క్యాబ్‌లపై ప్రయాణికుల ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా పేర్కొన్నారు.
నైట్ బస్సు సర్వీసులకు సంబంధించిన మరింత సమాచారం కోసం 99592 26160 నంబర్‌ను సంప్రదించవచ్చని టీజీఎస్‌ఆర్టీసీ సూచించింది.