తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయనే ప్రచారం కొనసాగుతున్న వేళ.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ఫొటో, పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
కేసముద్రంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క కలిసి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం మునిసిపాలిటీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి.. బహిరంగ సభలో ప్రసంగించారు.
ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఫొటోలు ఉన్నాయి. అంతేకాదు.. బీఆర్ఎస్‌కు చెందిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఫొటోలు కూడా ఫ్లెక్సీలో కనిపించాయి.
కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ ఫొటో మాత్రం కనిపించలేదు. అంతేకాదు.. శంకుస్థాపన శిలాఫలకంపై కూడా ఆమె పేరు లేకపోవడం చర్చకు దారితీసింది.
మరోవైపు ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంత ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె ఫొటో, పేరు లేకపోవడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చిందనే చర్చ జరుగుతోంది.
అయితే ఫ్లెక్సీలో ఫొటో, పేరు లేకపోవడానికి అసలు కారణం ఏమిటన్నది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. మంత్రివర్గ మార్పులపై కూడా ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
దీంతో కేసముద్రం ఫ్లెక్సీ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.