కృష్ణాజిల్లాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. పోలీసుల ఆత్మరక్షణలో భాగంగా ఓ నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు.
నల్లజర్ల సమీపంలోని దేవరపల్లి ప్రాంతంలో పోలీసులను గాయపరిచి పరారైన నిందితుడు అఖిదాసరి అవినాష్‌ను పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు.
పక్కా సమాచారంతో కంకిపాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తమ సిబ్బందితో కలిసి కంకిపాడు మండలం కోమటికుంట లాకుల డొంక రోడ్డు వద్దకు వెళ్లారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో అతడు పోలీసులపై కత్తి, రాళ్లతో దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఈ దాడిలో కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిపై గాయాలైనట్లు సమాచారం.
దుండగుడు దాడి కొనసాగించడంతో.. పోలీసుల ఆత్మరక్షణలో భాగంగా కంకిపాడు సీఐ కాల్పులు జరిపారు. నిందితుడి రెండు కాళ్లపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
కాల్పుల్లో గాయపడిన నిందితుడిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య బృందం అతడికి చికిత్స అందిస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.