రూ.1,276 కోట్ల వార్షిక ఆదాయం.. 2.78 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు
హైదరాబాద్ : దేశంలో అత్యధిక వార్షికాదాయం ఆర్జించే రైల్వే స్టేషన్ల జాబితాలో సికింద్రాబాద్ జంక్షన్ సత్తా చాటింది. ప్రయాణికుల రాకపోకలు, ఆదాయం పరంగా దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూ.1,276.29 కోట్ల ఆదాయం ఆర్జించగా.. సుమారు 2.78 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఈ వివరాలను రైల్వే శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
రైల్వే నివేదిక ప్రకారం.. దేశంలో అత్యధిక వార్షికాదాయం ఆర్జించే స్టేషన్లలో న్యూఢిల్లీ రూ.3,337 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా రూ.1,692 కోట్లతో రెండో స్థానంలో, తమిళనాడులోని ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రూ.1,299 కోట్లతో మూడో స్థానంలో నిలిచాయి. వీటి తర్వాత సికింద్రాబాద్ జంక్షన్ రూ.1,276.29 కోట్ల ఆదాయంతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య కీలకమైన అనుసంధాన కేంద్రంగా సికింద్రాబాద్ జంక్షన్ ఉండటమే ఈ స్థాయిలో ఆదాయం, ప్రయాణికుల రాకపోకలకు ప్రధాన కారణంగా రైల్వే శాఖ పేర్కొంది.
దక్షిణ మధ్య రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయంగా ఉన్న సికింద్రాబాద్ నుంచి రోజుకు 180కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రతిరోజూ సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణిస్తున్నారు.
రూ.714 కోట్లతో ఆధునికీకరణ
ప్రస్తుతం అమృత్ భారత్ పథకం కింద సుమారు రూ.714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. విమానాశ్రయాలకు దీటుగా ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మెట్రో రైలు అనుసంధానం, మల్టీ-లెవల్ పార్కింగ్ వంటి ఆధునిక వసతులను ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు.
ఆధునికీకరణ పనులు పూర్తయిన తర్వాత స్టేషన్ సామర్థ్యం మరింత పెరుగుతుందని, తద్వారా మరిన్ని రైళ్లు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
ఈ ఆధునికీకరణ పనులు 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశంలోని టాప్-3 స్టేషన్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.