ఉరవకొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్నేహితులు మృతి
అనంతపురం జిల్లా: ఉరవకొండ పోలీస్ స్టేషన్‌కు ఓ కేసు విషయంలో రాజీ (కాంప్రమైజ్) కోసం వచ్చిన ముగ్గురు స్నేహితులు తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన గురువారం రాత్రి గుత్తకల్లు ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వజ్రకరూరు ప్రాంతానికి చెందిన జైనుల్లా (44), మహబూబ్ బాషా (33), మహ్మద్ రఫీ (29) ముగ్గురు స్నేహితులు ఓ కేసు విషయంలో రాజీ కోసం గురువారం ఉరవకొండ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీస్ స్టేషన్‌లో పని ముగించుకుని రాత్రి సమయంలో ఒకే ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు.
ఈ క్రమంలో వారు గుత్తకల్లు ప్రధాన రహదారిపై ప్రయాణిస్తుండగా, గుర్తుతెలియని వాహనం వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. గుర్తుతెలియని వాహనం కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు స్నేహితులు ఒకేసారి మృతి చెందడంతో వజ్రకరూరు ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందా? ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.