విశాఖపట్నం: దశాబ్దాలుగా సరైన నివాస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న వేలంపేట–లక్ష్మీనగర్ ప్రాంతంలోని పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారం కానుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 35వ వార్డులో రాష్ట్రంలోనే తొలి మోడల్ స్లమ్ రీ-డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ శంకుస్థాపన చేశారు.
జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చొరవతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు.
రూ.28.44 కోట్లతో 177 గృహాలు
సుమారు 50 ఏళ్లుగా మౌలిక సదుపాయాలు, సురక్షిత నివాసాలు లేక ఇబ్బందులు పడుతున్న 177 పేద కుటుంబాల కోసం ఆధునిక బహుళ అంతస్తుల గృహ సముదాయాన్ని నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.28.44 కోట్ల వ్యయం కానుంది. సుమారు 55 సెంట్ల స్థలంలో 12 అంతస్తుల భవనాన్ని, దాదాపు 45 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్నారు. ఆధునిక షేర్‌వాల్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు మంత్రి పి. నారాయణ తెలిపారు.
ఒక్కో గృహ యూనిట్ విలువ సుమారు రూ.16.07 లక్షలు ఉంటుందని వెల్లడించారు. శంకుస్థాపన అనంతరం మంత్రి లబ్ధిదారులకు హామీ పత్రాలను అందజేశారు.
నాణ్యతకు ప్రాధాన్యం
ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. నిర్మాణ పనులను టెండర్ దక్కించుకున్న ఎన్‌సీసీ సంస్థకు అప్పగించినట్లు తెలిపారు.
ప్రాజెక్టును 9 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా స్లమ్‌ల అభివృద్ధి
వేలంపేట స్లమ్ రీ-డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను రాష్ట్రంలోనే తొలి మోడల్‌గా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర మురికివాడలను గుర్తించి, దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని చెప్పారు.
ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన, సురక్షితమైన, నాణ్యమైన నివాసం కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చొరవ
వేలంపేట–లక్ష్మీనగర్ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న నివాస సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు.
ప్రాంత ప్రజల సమస్యను మంత్రి పి. నారాయణ దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ప్రాజెక్టుకు ఆమోదం తీసుకువచ్చినట్లు తెలిపారు.
“దక్షిణ నియోజకవర్గంలో పేద ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే నా లక్ష్యం. వేలంపేట స్లమ్ రీ-డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు రాష్ట్రంలోనే తొలి మోడల్‌గా శ్రీకారం చుట్టడం చారిత్రాత్మక నిర్ణయం” అని వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో దక్షిణ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
అధికారులు, కూటమి నేతలు హాజరు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఎమ్మెల్యే పి. విష్ణు కుమార్ రాజు, టీడీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త సీతంరాజు సుధాకర్, బీజేపీ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొత్స సురేష్, జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ రాజు, అదనపు కమిషనర్లు, సౌత్ జోనల్ కమిషనర్, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఏ. రెహమాన్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కూటమి నేతలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
వేలంపేట స్లమ్ రీ-డెవలప్‌మెంట్ పూర్తయితే దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 177 కుటుంబాలకు సురక్షితమైన, ఆధునిక నివాస సదుపాయం అందుబాటులోకి రానుంది.