విజయవాడ: నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌పై కారు అగ్నిప్రమాదానికి గురికావడంతో తీవ్ర కలకలం రేగింది. మరమ్మతుల అనంతరం టెస్ట్ డ్రైవ్ చేస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. చూస్తుండగానే పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పింది.
టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా పొగలు
విజయవాడకు చెందిన ఓ డాక్టర్ తన కారును మరమ్మతుల కోసం మహానాడు రోడ్డులోని ఓ మెకానిక్ షెడ్‌కు ఇచ్చారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత మెకానిక్ సురేశ్ కారును టెస్ట్ డ్రైవ్ చేసేందుకు బయటకు తీసుకెళ్లాడు.
స్క్యూ బ్రిడ్జి వద్ద యూ-టర్న్ తీసుకుని బెంజ్ సర్కిల్ కొత్త ఫ్లైఓవర్‌పైకి చేరుకున్న సమయంలో కారులోని ముందు భాగం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది.
దీన్ని గమనించిన తోటి వాహనదారులు మెకానిక్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే స్పందించిన సురేశ్ కారును రోడ్డుపక్కన ఆపి కిందకు దిగిపోయాడు.
క్షణాల్లో మంటలు.. టైర్లు పేలడంతో భయాందోళన
మెకానిక్ కారు నుంచి దిగిన కొద్ది క్షణాల్లోనే మంటలు ఒక్కసారిగా వేగంగా వ్యాపించాయి. కారు మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో పెద్ద శబ్దాలతో టైర్లు పేలడంతో ఫ్లైఓవర్‌పై ఉన్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.
చూస్తుండగానే కారు పూర్తిగా కాలిపోయి బూడిదైంది.
ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటన కారణంగా బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌పై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
షార్ట్ సర్క్యూట్ కారణమా?
ప్రాథమిక విచారణలో కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.