విశాఖపట్నం: నగరంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వాల్తేరు డిపో సమీపంలో నిలిపి ఉంచిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
ఇంజిన్ నుంచి పొగలు.. క్షణాల్లో మంటలు
శుక్రవారం రాత్రి నెల్లూరు నుంచి ప్రయాణికులతో వచ్చిన ఆర్టీసీ బస్సును వాల్తేరు డిపో వద్ద నిలిపి ఉంచారు. అయితే శనివారం తెల్లవారుజామున బస్సు ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా పొగలు వెలువడినట్లు తెలుస్తోంది.
కొద్దిసేపటికే పొగలు కాస్తా మంటలుగా మారాయి. చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో స్థానికంగా కలకలం నెలకొంది.
హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది
బస్సులో మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అయితే అప్పటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది.
ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం లేదా షార్ట్ సర్క్యూట్ కారణమా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నట్లు సమాచారం.